‘ఫోటో జర్నలిజం వార్తలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది’..మంత్రి
నేటి వార్తల ప్రపంచంలో ఫోటో జర్నలిజం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, వార్తాపత్రికల పేజీలలో ఫోటోలు లేకపోవటం వలన ప్రచురణ నిస్తేజంగా మరియు ఆకర్షణీయంగా ఉండదని పేర్కొన్నారు రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం రాష్ట్ర స్థాయి వార్త ఛాయాచిత్రాల ప్రదర్శనను నిర్వహించింది. ఈ ప్రదర్శనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్త చిత్రాలకు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని, అవి పదాల కంటే వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కె. విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫలితాలను ప్రదర్శిస్తూ, ఎగ్జిబిషన్ గత సంవత్సరంలో అత్యుత్తమ మరియు అత్యంత ముఖ్యమైన ఫోటో జర్నలిజం మరియు డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీని ప్రదర్శించడం అభినందనీయమన్నారు.