కట్టుబట్టలతో ఇళ్లు విడిచిపోతున్న ప్రజలు
విజయవాడ వాసులకు బుడమేరు గండం ఇంకా తొలగిపోలేదు. మళ్లీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు చేయడంతో భయాందోళనతో కట్టుబట్టలతో ఇళ్లు విడిచి పోతున్నారు. బురద మేటలు వేయడం, పాములు, తేళ్లు వంటి విషజంతువులు ఇళ్లలోకి చేరడంతో బతికుంటే బలుసాకు తిని బతకొచ్చంటూ ఇతర ప్రదేశాలకు వలస వెళుతున్నారు. సింగ్ నగర్ ప్రాంతం అయితే పూర్తి నిర్మానుష్యంగా మారింది. వరద కాస్త తగ్గడంతో ఇళ్లలోనే చిక్కుకుపోయిన సింగ్ నగర ప్రజలు మళ్లీ బుడమేరు పొంగేలోపే బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. వారికి తిండి, నీరు కూడా దొరకడంలేదని వాపోతున్నారు. వారి సామాగ్రి సమస్తం కోల్పోయామని బాధపడుతున్నారు. పిల్లలతో ఉన్నవారు వైరల్ జ్వరాలు పెచ్చుపెరుగుతాయనే భయంతో ఇల్లు విడిచి పోతున్నారు. వారు ట్రాక్టర్లపై స్థానికులు పెద్దఎత్తున కాలనీలు ఖాళీ చేసి వెళ్తున్నారు.