ఆకలితో గోదాములపై ఎగబడ్డ జనం…గాజా వీడియో వైరల్
పాలస్తీనాలోని గాజాలో నానాటికీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఏకంగా ఆహారం నిల్వ చేసిన గిడ్డంగులపైనే ఎగబడి దాడులు చేశారు. అంతర్జాతీయ సంస్థలు, యూఎన్ఓ పంపిస్తున్న అన్నపానీయాలు, ఇతర ఆహార సామాగ్రిని ఉంచిన గిడ్డంగులపై దాడులకు పాల్పడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో గన్ పేలిన శబ్దాలు కూడా భయాన్ని కలిగిస్తున్నాయి. గాజా ప్రజలకు అందించే ఆహారాన్ని కూడా ఇజ్రాయెల్ పరిమితంగానే అనుమతించింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు గాయపడ్డారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్- హమాస్ల మధ్య యుద్ధం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకూ 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు అందించే సాయాన్ని హమాస్ దారి మళ్లిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ మాత్రమే ప్రస్తుతం సహాయాన్ని స్వీకరించి అందిస్తోంది. అయితే ఈ ఫౌండేషనే ఆహారాన్ని దారి మళ్లిస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది.