Breaking NewsHome Page Sliderhome page sliderInternational

క్షిపణి నిల్వలపై పెంటగాన్ నివేదిక లీక్..?

అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో, అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)కు చెందిన ఒక రహస్య నివేదిక లీక్ కావడం సంచలనంగా మారింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టడంలో కీలకమైన ఇంటర్ సెప్టర్ క్షిపణులు ,గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు అమెరికా వద్ద వేగంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి వీటిని విరివిగా వాడుతుండటంతో, మరో 10 రోజుల పాటు ఇదే స్థాయిలో దాడులు కొనసాగితే క్షిపణి నిల్వలు పూర్తిగా అట్టడుగుకు చేరుకోవచ్చని పెంటగాన్ హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ ,ఇజ్రాయెల్‌ వంటి మిత్రదేశాలకు భారీగా ఆయుధ సంపత్తిని తరలించడం వల్ల అమెరికా సొంత నిల్వలపై ఈ ప్రభావం పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆయుధ సంపత్తిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి భారీగా నిధులు , సమయం అవసరమవుతాయని, ఒకవేళ నిల్వలు అయిపోతే ఇరాన్ దాడులను ఎదుర్కోవడం అసాధ్యంగా మారుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది.

పెంటగాన్ హెచ్చరికలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ధీమాగా స్పందిస్తున్నారు. తమ వద్ద క్షిపణుల కొరత లేదని, సరిపడా అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉన్నాయని ఆయన ప్రకటించారు. కేవలం అమెరికాలోనే కాకుండా ఇతర మిత్రదేశాల్లోని స్థావరాల్లో కూడా ఆయుధాలను నిల్వ ఉంచామని, ఇరాన్‌పై దాడులు మరో ఐదు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగినా తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఒకవైపు పెంటగాన్ నివేదిక ఆయుధాల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు యుద్ధ వ్యూహంలో భాగంగా ఇరాన్‌ను మానసికంగా దెబ్బతీయడానికేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న కొద్ది రోజులు పశ్చిమాసియా యుద్ధ గమనాన్ని నిర్ణయించనున్నాయి.