NewsNews AlertTelangana

రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదైంది. ఆయనపై 2004 నుంచి మొత్తం 101 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో 18 మతపరమైన కేసులు కూడా ఉన్నాయి. దీంతో చర్లపల్లి జైలుకు తరలించిన రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఆయనపై మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులను ఆధారంగా చేసుకొనే బీజేపీ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆయనకు 6 నెలల నుంచి ఏడాది వరకు బెయిల్‌ వచ్చే అవకాశం కూడా లేదు.

ఇప్పటికే బీజేపీ నుంచి సస్పెండ్‌ అయిన రాజాసింగ్‌ శాసన సభ్యత్వాన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. పీడీ యాక్ట్‌ కేసు కోర్టులో నిరూపితమైతే ఐదేళ్ల వరకూ జైలు శిక్ష కూడా పడనుంది. తనను నగర బహిష్కరణ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారంటూ రాజాసింగ్‌ సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేసిన కొద్ది సేపటికే పోలీసులు అరెస్టు చేశారు. విలేకరులకు పంపిన ఆ వీడియోలో మజ్లిస్‌ పార్టీపై రాజాసింగ్‌ భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పాతబస్తీలో ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను దించారు.