నరసాపురంలో జనసేన నాయకులతో పవన్
జనసేన తరపున గత ఎన్నికలలో పోటీ చేసిన పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ నరసాపురంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో సమస్యలపై మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కోసం వచ్చిన మన పార్టీ మర్యాద కోల్పోకుండా, ప్రలోభాలకు లోను కాకుండా పదేళ్లుగా మంచిపేరు తెచ్చుకుందన్నారు. మొదలు పెట్టినపనిని ఎట్టి పరిస్థితులలో వదిలివేయకూడదని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జనసేన పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ప్రజలనమ్మకాన్ని కోల్పోలేదన్నారు. లక్షలాది ప్రజలు మనవెంటే ఉన్నారన్నారు. ప్రలోభాలకు లోను కాకుండా వీరు తన వెంట జనసైనికులలా ఉన్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో టూరిజం చాలా అభివృద్ధి చేయొచ్చన్నారు. కేరళ తరహాలో బ్యాక్ వాటర్ టూరిజానికి ఎంతో అవకాశం ఉందన్నారు. ఇతర రాజకీయ నాయకులులా తన వద్ద వందల కోట్లు లేవని, ప్రజల మనస్సులను నిజాయితీతోనే గెలుచుకుంటున్నానని ధీమా వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ఏ ఒక్కరి చేతుల్లోకో వెళ్లిపోకూడదన్నారు. గోదావరి జిల్లాలో వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే దివ్యక్షేత్రాలు గల గోదావరి జిల్లాలు యాత్రికులతో కళకళలాడేలా చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి పాలకులు వీటిపై శ్రద్ధ పెట్టలేదన్నారు.