News Alert

రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్

◆ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో మార్పులకు సన్నాహాలు
◆ రాజకీయ పార్టీలు జవాబుదారిగా ఉండాల్సిందే..!
◆ ఉచిత పథకాలపై చర్చ నేపథ్యంలో కీలక నిర్ణయం
◆ గుర్తింపు పొందిన పార్టీలకు ఎన్నికల సంఘం లేఖలు
◆ ఈసీ ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల అసహనం

దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి రాజకీయ పార్టీలను మరింత జవాబుదారీగా చేయటానికి ఓటర్లకు నిజమైన సమాచారాన్ని అందించాలని అన్ని పార్టీలను భారత ఎన్నికల సంఘం కోరింది. ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా గతంలో జోక్యం చేసుకోవడం ఇప్పుడు ఈసీ నుంచి తాజా ప్రతిపాదన రావడం ఇదంతా రాబోవు ఎన్నికల్లో తమ తమ మేనిఫెస్టోలోని పథకాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలుకు ఆర్థికపరమైన చిక్కులు వాటికి ఆర్థిక సాయం చేసే మార్గాల వివరాలను అందించమని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఈసీ సూచించడంతో ఆ ప్రతిపాదనను రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

దీంతోపాటు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పాటించవలసిన ప్రవర్తన నియమావళిలో మార్పులు తేవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలియజేయాలని ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది. ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీలు చేస్తున్న వాగ్దానాలు పారదర్శకంగా ప్రజలకు అన్ని విషయాలు తెలిసే విధంగా ఉండేలా చూడాలన్న లక్ష్యంతో నియమావళిలో మార్గదర్శకాలు సవరించాలని ఈసీ ప్రతిపాదించింది. వాగ్దానాల అమలు కోసం నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారు, అదనంగా పన్నులు విధించడం వంటి చర్యలు తీసుకుంటారా, ఖర్చులను హేతుబద్ధం చేయడం కోసం కొన్ని పథకాలలో కోత విధిస్తారా, మరిన్ని అప్పులు చేస్తారా వంటి వివరాలను రాజకీయ పార్టీల నుండి సరైన ప్రొఫార్మాలో ఈసీఐ కోరింది. ఈసీ ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అసలు మేనిఫెస్టో తో మీకేం పని మేనిఫెస్టోలో జోక్యం చేసుకునే అధికారం ఈసీకి లేదని రాజకీయ పార్టీలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఈసీ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా ఎలక్షన్ కమిషన్ తీరును ఆక్షేపించారు. ఇది ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని కాదని పోటీ తత్వ రాజకీయాలసారం స్ఫూర్తికి ఇది విరుద్ధమని ఆయన అన్నారు ఈ దిశగా ముందుకు వెళితే భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇది మరో పొరపాటు అవుతుందని చెప్పారు. ఈసీ ప్రతిపాదలని శివసేన పార్టీ కూడా తప్పు పట్టింది ఈడీ, సీబీఐ తరహాలోనే ఎన్నికల ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణ కూడా మసకబారుతుందని ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు హామీలను నిలబెట్టుకోకపోతే విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తే ఓటర్లే వారిని గద్దె దించుతారని చెప్పారు. ఇలా వివిధ రాజకీయ పార్టీల నుండి ఈసీ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈనెల 19 లో వారి వారి అభిప్రాయాలను తెలపాలని లేఖలో కోరింది. దీనిపై రాజకీయ పార్టీలు భవిష్యత్తులో తమ నిర్ణయాలను ఎలా వెల్లడిస్తాయో చూడాల్సి ఉంది.