News Alert

బాలుడి మృతదేహానికి ఉప్పు పాతరేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే!

నీట మునిగి మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్‌(10) సెప్టెంబర్ 4న తన మిత్రులతో కలిసి దగ్గరలోని చెరువులో ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు.

అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలుడు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, డాక్టర్లు గ్రామానికి చేరుకున్నారు. బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు తమ కుమారుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.