పాక్ కీలక నిర్ణయాలు..భారత్ హెచ్చరికలు
భారత్ ప్రతీకారచర్యల నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమాయక పర్యాటకులపై ఉగ్రదాడికి ఉసిగొల్పిన పాక్ భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అని భయపడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా పాక్ నిఘా సంస్థకు చెందిన ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్‌ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. పాకిస్తాన్ కేబినెట్ సెక్రటరీ పాక్ NSAగా ఆసిమ్ మాలిక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన గతంలో పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో అడ్జుటంట్ జనరల్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ పాక్ మిలటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. ఆ సమయంలోనే మాజి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆయన మద్దతుదారులపై ఆర్మీ అణచివేత వంటి చర్యలు చేపట్టారు. మరోపక్క వరుసగా ఏడోరోజు కూడా పాక్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉరి, కుప్వారా, అఖనూర్ సెక్టార్లలో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. ఇప్పటికే పాక్ డీజీఎంవోతో భారత డీజీఎంవో ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పాక్ సైన్యం కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ గట్టిసమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.