‘పాకిస్తాన్‌ను ‘ఫేట్ గ్రే’ లిస్ట్‌లో పెట్టాలి’..ఓవైసీ
పాకిస్తాన్ ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యిందని, ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆయన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి అల్జీరియాలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను మరోసారి ‘ఫేట్ గ్రే’ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) లిస్ట్‌లో పెట్టాలన్నారు. ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహించే దేశాలకు ఇతర దేశాల నుండి ఆర్థిక సహాయాన్ని అందకుండా చేయడానికి ఈ లిస్ట్ ఉపయోగిస్తుంది. 26/11 ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ జకీర్ రెహ్మాన్ లఖ్వీకి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించిందని, అతడు జైలులో ఉండగానే తండ్రి కావడానికి అనుమతించిందని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోందని, అందుకే భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా కేవలం ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడి చేసిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారత్ ప్రభుత్వం తరపున దేశంలోని అన్ని పార్టీల నుండి ఎంపీలను 30 దేశాలకు అంబాసిడర్లుగా పంపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్జీరియా వెళ్లిన అసదుద్దీన్ పాక్ చర్యలను ప్రపంచదేశాల ముందు ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

