డ్రోన్ సాయంతో ఆయుధాలు జార విడుస్తున్న పాకిస్తాన్
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని తోప్ గ్రామంలో పాకిస్థాన్ డ్రోను ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జారవిడిచి కలకలం రేపింది. దీనిపై అర్నియా పోలీస్ లు కూడా కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి జమ్మూలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనికి ఈ కేసుతో పూర్తి సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్నాక అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఆయుధాలను.. మందుగుండు సామగ్రిని డ్రోను జారవిడిచిందో అతని నుండి పూర్తి సమాచారాన్ని సేకరించారు.

అతను చెప్పిన ప్రాంతంలో తనిఖీలు చేసినప్పటికీ ఏమీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. అయితే తోప్ గ్రామంలో మాత్రం కొన్ని ఆయుధాలు.. మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు .. అదుపులోకి తీసుకుని, ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ అతను మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు, ఉగ్రవాదులకు డ్రోన్ల సాయంతో పాకిస్తాన్ పేలుడు పదార్థాలను అందజేస్తోంది. భారత భద్రతా బలగాలు ఇప్పటికే చాలా డ్రోన్లను కుప్పకూల్చాయి. నిఘా వ్యవస్ధను తప్పించుకుని కొన్ని ఆయుధాలను చేరవేస్తున్నాయని అధికారులు అంటున్నారు.

