నన్ను పదేళ్లు జైల్లో ఉంచేందుకు పాక్ ఆర్మీ ప్లాన్ : ఇమ్రాన్ ఖాన్
దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం తెల్లవారుజామున సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు. లండన్ ప్లాన్ బహిర్గతమైందని, తన చివరి రక్తపు బొట్టు వరకు వంచకులకు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పారు. తన భార్యని జైలులో పెట్టడం ద్వారా తనను అవమానరిచే ప్రయత్నం చేశారన్నారు. తనకు మద్దతుగా నిరసనలు తెలిపే వారిని అణిచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మీడియాను నియంత్రిస్తున్నారన్నారు. ఎందుకంటే రేపు తనను మళ్లీ అరెస్ట్ చేసినప్పుడు వారు బయటకు రావొద్దని భావిస్తున్నారన్నారు. అవసరమైతే ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారన్నారు.
అంతకుముందు పాక్ సైన్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్.. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు. దాదాపు 100 కేసుల్లో బెయిల్‌పై ఉన్న ఇమ్రాన్ ఖాన్ మరో కేసులో లాహోర్ కోర్టుకు హాజరుకానున్నారు.