InternationalNews Alert

స్టేడియంలో కుర్చీలతో కొట్టుకున్న పాక్, ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్

ఆసియా కప్‌-2022 టోర్నీలో భాగంగా సూపర్ 4లో నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. ఆసిఫ్ అలీ (పాకిస్తాన్), ఫరీద్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) మధ్య గొడవ. ఫరీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాక ఆసిఫ్ అలీ పెవిలియన్ చేరుతున్నప్పుడు, ఔట్ చేసిన జోష్‌లో ఫరీద్ అతనికి చాలా దగ్గరికి వెళ్లి తాను వికెట్ తీశానన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అది నచ్చని అలీ కోపంతో అతడ్ని వెనక్కు నెట్టాడు. అంతటితో ఆగకుండా ఫరీద్‌పై బ్యాటుతో కొట్టడానికి వెళ్లాడు. ఇక్కడ అలీ ప్రవర్తించిన తీరు ముమ్మాటికీ తప్పు. వాస్తవానికి ఫరీద్ మొదట్లో రెచ్చగొట్టింది అయినప్పటికీ, ఆసిఫ్ అలీ బ్యాటుతో దాడి చేయడానికి యత్నించడమన్నది ఆమోదయోగ్యం కాదు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల ఎలా ప్రవర్తించాలో అలీ నేర్చుకోవాలి.

ఇక రెండోది.. ఫ్యాన్స్ మధ్య గొడవ. పాకిస్తాన్‌తో కచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆగ్రహంతో మైదానంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. వాటిని విరగ్గొట్టి మరీ, పాకిస్తాన్ అభిమానులపై విసిరేశారు. పాకిస్తాన్ అభిమానులు కూడా ఎదురు దాడికి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. పాక్ ప్లేయర్ అసిఫ్ అలీ..అప్గాన్ బౌలర్ ఫరీద్‌పై బ్యాట్ ఎత్తడమూ అభిమానుల కోపానికి కారణమైంది. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోయబ్ అఖ్తర్ సైతం వీడియో షేర్ చేసి.. క్రికెట్ ఒక ఆట మాత్రమేనని, దీన్ని రైట్ స్పిరిట్‌లో తీసుకోవాలే గానీ ఇలా దాడులకు దిగకూడదని అన్నాడు. కానీ.. అలీ ప్రవర్తనపై మిన్నకుండిపోయిన అఖ్తర్ ఆఫ్ఘన్ అభిమానులకు హితబోధ చేయడమేంటి ..? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.