Home Page SliderTelangana

సంజయ్‌కు వ్యతిరేకంగా మరో గళం

బీజేపీలో బండి సంజయ్ నాయకత్వంలో న్యాయం జరగడం లేదంటూ నేతలు గళం విప్పుతూనే ఉన్నారు. మొన్న ఎంపీ అర్వింద్, నిన్న శేఖర్జీ.. ఇవాళ అంజయ్య… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. మూడేళ్ళ నుంచి పార్టీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ కార్యవర్గంలో దళితులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కన్నం అంజయ్య. తాము పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసామని.. కుటుంబాన్ని వదులుకున్నామని… తమను కాదని నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని, ఆయన బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ చర్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

బండి సంజయ్ కార్పొరేట్లకు, NRIలకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు అంజయ్య. వారికే పార్టీలో పదవులిస్తున్నారని విమర్శించారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీ కోసం పనిచేసేవారిని కాదని కార్పొరేట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్ వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారని… దళిత నాయకులను కావాలని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. పది రోజుల్లో బండి సంజయ్ బాధితులతో ఆత్మీయ సమ్మేళనం పెడతానన్నారు. రాష్ట్ర పార్టీలో సంజయ్‌పై వ్యతిరేకత ఎంత ఉందో చూపిస్తానన్నారు. పదవులు రాకపోతే బీజేపీ రాష్ట్ర ఆఫీస్ తలుపులు పగులగొట్టినట్టే… తానూ, నిరసన వ్యక్తం చేస్తున్నన్నారు కన్నం అంజయ్య.

బీజేపీలో ఎస్సీలు అంటే మాలలు మాత్రమేనా, మాదిగలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహానికి ప్రారంభించడానికి సంజయ్ వెళ్లారని… బీజేపీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ జయంతిని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు సస్పెండ్ చేస్తావా అంటూ ఆయన సంజయ్‌పై నిప్పులు చెరిగారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా… పార్టీ మాత్రం మారబోనని ప్రకటించారు. బీజేపీ చీఫ్‌‍గా బాధ్యతలు చేపట్టాక… బండి కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి… సంజయ్ స్త్రీల పట్ల, కవితపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. తక్షణం సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అంజయ్య డిమాండ్ చేశారు.