ఓవైసి కాలేజీ ని కూల్చలేము… హైడ్రా కమిషనర్..
పాతబస్తీలోని సూరం చెరువు ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్ భూభాగంలో నిర్మితమైన ఫాతిమా కాలేజీపై ఇటీవల రాజకీయంగా చర్చ జరుగుతుండగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఈ కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించగా, ప్రతిపక్షాలు “ఇది అక్రమ నిర్మాణమైతే ఇప్పటివరకు ఎందుకు కూల్చలేదే?” అని హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నాయి. “సామాన్యులకు ఒక న్యాయం, ఒవైసీకి మరో న్యాయమా?” అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో స్పందించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, ఫాతిమా కాలేజీ నిజంగానే ఎఫ్‌టీఎల్‌లో నిర్మించబడిందని, 2024 సెప్టెంబర్‌లోనే తొలగించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. అయితే, ఈ కాలేజీలో పేద ముస్లిం మహిళలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించబడుతున్నట్టు తెలిపారు. ఇక్కడ ఫీజులు వసూలు చేయడం లేదని, ప్రస్తుతం 10,000 మందికి పైగా బాలికలు, యువతులు చదువుకుంటున్నారని వివరించారు. ఈ కారణంగా ఈ కాలేజీ సామాజిక స్పృహతో నడుస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని, కూల్చివేతపై తాత్కాలికంగా ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఇది ఎంఐఎం నేతలపై మినహాయింపు కాదని, ఇతర అక్రమ నిర్మాణాలపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంఐఎం నేతలతో సంబంధం ఉన్న దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేశామని, 25 ఎకరాల చెరువును ఫ్లాట్‌లుగా మార్చిన నిర్మాణాలను కూల్చివేశామని వెల్లడించారు. చివరగా, సామాజిక బాధ్యత, విద్యాపరమైన సేవ, మరియు స్వచ్ఛ పాలన మధ్య సమతుల్యతను పాటించడమే తమ లక్ష్యమని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఫాతిమా కాలేజీపై తుది నిర్ణయం సామాజిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటామని చెప్పారు.

