మాది ప్రజాపాలన… మీది చీకటి పాలన
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఎవరు గుర్రాలు, ఎవరు గాడిదలొ తెలుసొచ్చింది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనను మెచ్చుకునేందుకు రేషన్ కార్డుల పంపిణీకి కూడా సభలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు రూ.300 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో రూ.3000 కోట్ల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చినా ఎప్పుడు ఇంత హడావిడి చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక, బుధవారం తెలంగాణ భవన్‌లో వికారాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఆ తర్వాత పరిస్థితులు మారుతాయని, పార్టీ శ్రేణులను వేధించే ఎవరికైనా ఇక అవకాశం ఉండదని స్పష్టం చేశారు.