Home Page SliderTelangana

‘అబద్దాలలో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆస్కార్ ఇవ్వొచ్చు’…కిషన్ రెడ్డి

బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అబద్దాలు చెప్పడంలో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో  పెద్దపల్లి, రామగుండంకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరిలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి కూడా ఉన్నారు.  ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందన్నారు. విద్యా, ఉద్యోగాలలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, ఆరోగ్యశ్రీని అటకెక్కించారని మండిపడ్డారు. ప్రతీ విషయంలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు తెలంగాణ ఓట్లడిగే హక్కు లేదని, 50 ఏళ్లుగా ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని రాహుల్, ప్రియాంకలు తెలంగాణకు వచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రతీ రాష్ట్రంలో బూటకపు హామీలను ఇస్తోందన్నారు. తెలంగాణలో రాబోయేది సకల జనుల సంక్షేమం కోసం పనిచేసే బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.