తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్షాలు గైర్హాజరు
నేడు (డిసెంబర్ 9) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలనే ఉద్దేశంతో విపక్షనేతలైన కేసీఆర్‌కు, బీజేపీ పార్టీ నుండి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, ఎంఐఎం నేతలకు కూడా స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ఆహ్వానాలు పంపారు. కానీ వారు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కాబోతున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల కారణంగా రాలేనని సమాచారం పంపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఅర్ సహా విపక్ష నేతలెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కారని సమాచారం. కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిందనే కృతజ్ఞతతో ఇలా చేస్తున్నట్లు ముందే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రమంత్రులు, పార్టీ ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొంటారు.

