Andhra PradeshNewsNews Alert

వైసీపీలో ఆపరేషన్ ఇన్ హౌస్

అంతా లుకలుకలే. అంతర్గత కుమ్ములాటలే. ఒకరికి ఒకరు పడని వైనమే. ఎక్కడికక్కడ తెగని పంచాయితీలే. ఎడమొగం పెడ మొగాలే. ఇలావుంటే రేపు ఎన్నికలకు ఎలా వెళ్ళేది..? ఎలా అనుకున్న టార్గెట్ ను సాధించగలిగేది. ఇదే ఇప్పుడు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టీడీపీ బలపడేందుకు, మళ్ళీ పాలనా పగ్గాలు చేపట్టేందుకు అన్ని రకాల వ్యూహాలతో అడుగులు వేస్తోంది. జనసేన ఇప్పటికే దూకుడు పెంచింది. బీజేపీ కూడా పునాదులు వేసుకునేందుకు తీవ్రంగా పావులు కదుపుతోంది. కానీ.. వైసీపీ మాత్రం వర్గ విభేదాలతో కుతకుత లాడిపోతోంది. ఈ పరిణామాలే రేపు ఎక్కడ కొంపలు ముంచుతాయోనన్న భయం ఆ పార్టీకి నిద్ర పట్టనివ్వడం లేదు. నియోజకవర్గాల్లో పని తీరు చూద్దామా అంటే 60 స్ధానాల్లో ఎవరికీ పాస్ మార్కులు దక్కని పరిస్ధితి. ఈ నేపధ్యంలో రానున్న ఎన్నికలను ఎలా నెట్టుకు రావాలి..? రెండవ పర్యాయం ఎలా అధికారాన్ని చేజిక్కించుకోవాలి..? టీడీపీకి బలమైన స్ధానాలపై దృష్టి పెడుతూనే.. తమ అంతర్గత సర్వేలలో తేలిన 60 నియోజకవర్గాల పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఆపరేషన్ ఇన్ హౌస్ నిర్వహిస్తున్నారు జగన్. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించే పనిలో పడ్డారు.


బలమైన పునాదులతో ఏపీలో వైసీపీ వేళ్ళూనుకుంది. క్షేత్ర స్ధాయి నుండి గట్టి బలాన్ని, బలగాన్ని కలిగి ఉంది. ఎన్ని ఎన్నికలనైనా తట్టుకుని నిలబడగలిగే సామర్ధ్యం ఉంది. ఎన్నికల వ్యూహ రచన చేయగల సత్తా ఉంది. కానీ.. ఎక్కడో భయం. ఏదో తెలియని అలజడి. చాపకింద నీరులా అసంతృప్తి. ఏ జిల్లాను పరికించినా.. పరిశీలించినా భగ్గు మంటున్న వర్గ విభేదాలు. మీడియా ముందే దూషణలు.. పరస్పర ఆరోపణలు .. అసంతృప్తితో నిరసనలు. ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీలో ఎక్కువయ్యాయి. నాలుగు గోడలు దాటి రోడ్డెక్కుతున్న కలతలు కక్షలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు జగన్ చేపడుతున్న చర్యలు కొత్త కష్టాలకు దారితీస్తున్నాయి. ఇంకా విభేదాలను పెంచుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 60 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల పని తీరు ఊహించినంతగా లేదని .. అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో తేలింది. దీంతో ఆయా ఎమ్మెల్యేలను తమ పని తీరు మెరుగు పరుచుకోవాలని అనేక పర్యాయాలు చెప్పి చూసినా .. ఫలితం లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో అదనపు ఇన్ చార్జీల నియామకాలు చేపట్టారు. ముందుగా తాడికొండ నుండి ఆపరేషన్ ఇన్ హౌస్ ప్రారంభించారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పోటీగా నియోజకవర్గానికి అదనపు బాధ్యుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. ఇదే అక్కడ ఇద్దరి మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ వ్యవహారం చివరికి తాడేపల్లికి చేరింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందు పంచాయితీ పెట్టిన శ్రీదేవికి ఆయన నుండి ఎలాంటి హామీ లభించలేదు. సరికదా.. వారం రోజుల్లో ఇద్దరి పని తీరును బేరీజు వేస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి


మరికొన్ని నియోజకవర్గాల్లో మంత్రులపైనే పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. దీంతో ఆయా మంత్రులు ఈసారి సేఫ్ జోన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి గుడివాడ అమర్నాధ్ కు ఈ సెగ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. లోలోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నా.. పైకి మాత్రం స్ధానిక నేతలు ఏమీ తెలియనట్టే ఉంటున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ తన కొంప ముంచుతుందోనని అనాకాపల్లి ఎమ్మెల్యే అమర్నాధ్ భావిస్తున్నారట. ఇక యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మీద సొంత పార్టీ వారే కలెక్టర్ కు ఫిర్యాదులు చేయడం హాట్ టాపిగ్గా మారింది. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కన్నబాబు సహకరిస్తున్నారని సొంతపార్టీ వారే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా మంత్రి అమర్ నాధే చేయిస్తున్నారన్ అభిప్రాయం కన్నబాబు వర్గీయులలో బలంగా ఉంది. దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది.


ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ కూడా పార్టీ నేతలపై తీవ్ర నారాజ్ లో ఉన్నాడు. అంతర్గతంగా తనకు కీడు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఇక చూస్తూ కూర్చొనంటూ తెగేసి చెబుతున్నారు. అలాగే నెల్లూరు వైసీపీలో కూడా వర్గ విభేదాలు మంటలు మండిస్తున్నాయి. ఈ పరిణామాలను చక్కదిద్ది రానున్న ఎన్నికలకు పార్టీని అన్ని రకాలుగా సమాయత్తం చేసే పనిలో జగన్ బిజీ అయ్యారు. దీనికి తోడు ఏ పార్టీ పనిలో ఆ పార్టీ ఉంటే.. బీజేపీ నిర్వహిస్తున్న పాత్ర వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. జగన్ తో సన్నిహితంగా ఉన్నట్లుగా పైకి కనిపిస్తున్నా… వ్యవహరిస్తున్న తీరు మాత్రం వైసీపీకి పలు అనుమానాలను కలిగిస్తోంది. ఆ పార్టీకి దగ్గరయ్యే దాని కంటే బాబును బీజేపీకి దూరంగా పెట్టాలన్న భావనే జగన్ లో ఎక్కువగా ప్రస్తుటమవుతోంది. ఇక వైసీపీలో అసంతృప్తితో రగిలి పోతున్న వారిని తమ పక్షానికి లాక్కునే పనులకు కూడా టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు వైసీపీకి ఎక్కడో అనుమానం. అందుకే తమ దృష్టికి వచ్చిన వారందరిపైనా జగన్ ఓ కన్నేసి ఉంచాడు. ఈ పరిణామాల మధ్య వచ్చే ఎన్నికలు చాలా రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం. ఏం జరుగుతుందో.