NationalNews Alert

పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ జోరు

శ్రావణమాసం మొదలు దాదాపు కార్తీక మాసం దీపావళి వరకూ పండులగ సీజన్ నడుస్తుంటుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా ఈ -కామర్స్ కంపెనీలు అమ్మకాలలో రకరకాల ఆఫర్లు, రాయితీలతో ప్రచారం ముమ్మరం చేస్తాయి. రాబోయే నెలరోజులలో ఆన్‌లైన్ వేదికగా దాదాపు 94 వేలకోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. 2021 లో ఈ సేల్స్ 4, 14,232 కోట్లు నమోదవగా, ఈ సంవత్సరం దాదాపు 30 శాతం అధికమవుతుందని అంచనాలు వేస్తున్నారు.

ఈమధ్య కాలంలో డిజిటల్ వ్యాపారం వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకు ముందు మహానగరాలకే పరిమితమైన ఆన్‌లైన్ వ్యాపారం ఇప్పుడు ద్వితీయశ్రేణి నగరాలలో కూడా ఊపందుకుంది. ఈ సీజన్ తొలివారంలోనే 47 వేలకోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఛాన్స్ ఉంది. ఫ్యాషన్ బ్రాండ్లు ఎక్కువ మొత్తంలో రంగప్రవేశం చేయనున్నాయి. పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగా అమ్మకాలు అధికంగా ఉంటాయని రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేషన్ పార్టనర్ సంజయ్ కొఠారీ తెలిపారు. మెరుగైన డీల్స్, నూతన ఆవిష్కరణలు కారణంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్ విభాగం బలమైన పనితీరు కనపరుస్తోంది. లైవ్, వీడియో కామర్స్ వల్ల షాపర్స్ సంఖ్య మరింత పెరుగుతోంది.