ఈడీ విచారణకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి డుమ్మా
వైసీపీ ఒంగోలు ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు డుమ్మా కొట్టారు. వాస్తవానికి ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరుకావాల్సిందిగా ఈడీ మాగుంటకు సందేశం పంపించింది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఆయన ఈడీకి సమాచారం అందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి మాగుంటను విచారిస్తే అసలు విషయాలు వెల్లడవుతాయని ఈడీ భావిస్తోంది. విచారణకు హాజరవ్వాలని ఈడీ మరోసారి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇవాళ రామచంద్ర పిళ్లైతో కలిసి మాగుంటను విచారించాలని ఈడీ భావించింది.

అయితే మాగుంట హాజరు కాకపోవడంతో మరోసారి ఇద్దరినీ కలిపి ఈడీ విచారించనుంది. ఫిబ్రవరి 11న ఈడీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ గ్రూప్ ఏర్పాటులో రాఘవ రెడ్డి కీలక పాత్ర పోషించాడని ఈడీ భావిస్తోంది. వ్యాపారవేత్తలు, రాజకీయనాయకుల మధ్య సంధానకర్తగా రాఘవరెడ్డి వ్యవహరించారని ఈడీ అనుమానిస్తోంది. లిక్కర్ బిజినెస్‌లో తలపండిన మాగుంట.. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామి కావాలని కోరుకున్నారని… మొత్తం వ్యవహారాన్ని తనయుడు రాఘవ డీల్ చేశారని ఈడీ చెబుతోంది.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారని.. తనకు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసేందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారని ఈడీ విచారణలో పేర్కొంది. మాగుంట శ్రీనివాసులు రెకడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి, శరత్ రెడ్డి (అరబిందో గ్రూప్), ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ వ్యాపారవేత్త సమీర్ మహేంద్రులను సౌత్ గ్రూప్‌గా పిలుస్తారు. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు.. ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్‌తోపాటుగా, ఇతర లిక్కర్ వ్యాపారవేత్తలతో సమావేశమైనట్టు ఈడీ భావిస్తోంది.

మనీష్ సిసోడియా కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ… కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపింది. 14 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ కోర్టుకు నివేదించింది. ఫిబ్రవరి 26న సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవవర్నర్ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన నాటి నుంచి మనీష్ సిసోడియా ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.

