Home Page SliderNews AlertTelangana

మరోసారి ఫుడ్‌ పాయిజన్‌.. అస్వస్థతకు గురైన విద్యార్థులు..

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో ఉద్రిక్తత నెలకొంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్‌ పాయిజన్‌ అయింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వరుస ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 మంది విద్యార్థులు నిన్న అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హాస్టల్‌లో మరికొంత మందికి కూడా అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నాణ్యత లేని భోజనం కారణంగా తాము అనారోగ్యం పాలైనట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పురుగులు, రాళ్లు ఉన్న అన్న పెడుతున్నారని ఆరోపించారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరాలతో తాము తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని విద్యార్థులు తెలిపారు. ప్రిన్సిపల్‌, సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు స్కూల్‌ బిల్డింగ్‌ పైకెక్కి నిరసన తెలిపారు. వార్డెన్‌ విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు పాఠశాలకు చేరుకొని.. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చి..  విద్యార్థులను సముదాయించారు. దీంతో వారు ఆందోళన విరమింపజేశారు.