మైనర్ బాలికపై అర్థరాత్రి దురాగతం
కీచకులు ఎక్కడో లేరు “మేకవన్నె పులుల వలే” జనుల మధ్యలోనే పొంచి ఉంటారు. అవకాశం కోసం ఎదురుచూస్తూ ఆదను చూసి అత్యాచారాలకు పాల్పడతారు. ఇలాంటి సంఘటనే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి దగ్గరలోని కేవీబీ పురం మండలంలో జరిగింది. ఊరంతా వినాయక చవితి సంబరాలలో మునుగి తేలుతుండగా, కేవీబీ పురం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ముగ్గురు యువకులు ఈ ఘటనలో ఉన్నట్లు మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులకు బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం వినాయక చవితి రోజు నాటి రాత్రి 9 వతరగతి చదువుతున్న బాలిక తన తల్లితో కలిసి గ్రామంలో వినాయక విగ్రహాలను చూసేందుకు వెళ్లింది. రాత్రి 10 గంటలకు అమ్మాయికి కడుపునొప్పి రావడంతో, ఇంట్లో వదిలి వెళ్లిన తల్లి తిరిగి 11 గంటలకు ఇంటికి వచ్చింది. కుమార్తె ఇంటిలో కనిపించకపోవడంతో ఊరంతా వెతికి చూసింది. మరలా గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లోని స్నానాలగదిలో తన కుమార్తె అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి, ఏమి జరిగిందో ఆరా తీసింది.

తాను స్నానాలగదికి వెళ్లిన సమయంలో నిందితులు సెల్వం, గుణ, అశోక్‌లు తనను అపహరించారని, సమీపంలోని శ్మశానవాటికకు తీసుకువెళ్లి, కర్రతో మోదగా, తాను కిందపడిపోయానని,గుణ, అశోక్‌లు పారిపోయారని, సెల్వం తనపై అత్యాచారం చేసారని బాధితురాలు పేర్కొంది. తర్వాత సెల్వం స్నానాలగది వద్ద వదిలేసిట్లు తెలిపింది. దీనితో బాధితురాలి తల్లి గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు. నిందుతులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయి మైనర్ కావడంతో పలువురు ఈ ఘటనపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు.

