NationalNews

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్‌ జారీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం కాకుంటే అక్టోబరు 17వ తేదీన ఎన్నిక జరుగుతుంది. 19వ తేదీన కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నో రాజకీయ ట్విస్టుల మధ్య ఎన్నికలు జరుగుతున్న ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఎంపీ శశిథరూర్‌ పోటీ చేస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి.

తాను కూడా రేసులో ఉన్నానంటూ మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ చివరి నిమిషంలో పోటీకి ఆసక్తి చూపించారు. బరిలో ఇద్దరే ఉండాలా.. నేను పోటీ చేయకూడదా.. అని మీడియాను ప్రశ్నించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసేందుకు దిగ్విజయ్‌ ఢిల్లీ వెళ్లారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకున్నా ఆందోళన అవసరంలేదని, రాహుల్‌గాంధీకి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తారని చెప్పారు. గాంధీ కుటుంబం దూరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీని ఇతర నాయకులు నడిపించారని గుర్తు చేశారు.