నోటా కూడా అభ్యర్థేనా?.. పార్టీలేమంటున్నాయి?
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవానికి తావు లేదని, నోటాను కూడా ఉంచి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. నోటా తప్పనిసరిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం అధికారులు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంలో నోటాను అభ్యర్థిగా పరిగణించరాదని, ఏకగ్రీవ ఎన్నిక ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు అని పేర్కొంది. బీజేపీ ఈ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండడంతో తమ అభిప్రాయం వెల్లడించలేదు. బీఆర్‌ఎస్ పార్టీ దీనిని సమర్థించింది. ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బల ప్రదర్శనలు ఉండొచ్చని, అందుకే నోటా ఉండాల్సిందేనని అభిప్రాయపడింది. టీడీపీ మరో రెండు రోజుల సమయం తీసుకుని తమ అభిప్రాయం తెలియజేస్తామని వెల్లడించింది. జనసేన పార్టీ, సీపీఎం పార్టీలు నోటా కూడా ఉండాల్సిందేనని, ఏకగ్రీవ ఎన్నిక మంచిది కాదని అభిప్రాయం వెల్లడించాయి.