Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

‘నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయండి’..రాజాసింగ్

తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ కల్లోలం రేపుతోంది. తరుచుగా టీ.బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. హిజ్రాలు అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకత్వం సీరియస్‌గా ఉంది. ఎమ్మెల్యే వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో టీ.బీజేపీ నాయకత్వం చర్చించనుంది. రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైకమాండ్‌తో చర్చించి ఎమ్మెల్యేపై చర్యలకు స్టేట్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం మాట్లాడి ఆయనను సస్పెండ్ చేసే దిశగా చర్యలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో పనిచేస్తున్న సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాళ్లతో పనిచేయడానికి బదులు తనను సస్పెండ్ చేయాలంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను అటు హైకమాండ్.. ఇటు స్టేట్ బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్ అనంతరం జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ బీజేపీపై రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేస్తూ రెబల్‌గా మారే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడినా, పార్టీకి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తప్పవని ఇటీవల హైకమాండ్, స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దమ్ముంటే సస్పెండ్ చేయాల్సిందిగా సవాల్ విసురుతూ ఎమ్మెల్యే ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్.. ఏ క్షణమైనా రాజాసింగ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.