‘గ్లోబల్ వార్మింగ్’ కాదట…’గ్లోబల్ బాయిలింగ్’
మనం నివసించే భూమి ‘గ్లోబల్ వార్మింగ్’కు గురవుతోందని శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోతోందట. గ్లోబల్ వార్మింగ్ దశను దాటి ‘గ్లోబల్ బాయిలింగ్’ దశకు చేరుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష సంవత్సరాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, భవిష్యత్తులో ఇంకా మించి పోగలదని హెచ్చరిస్తున్నారు. ఈసంవత్సరం ఆరంభం నుండీ ప్రపంచ వ్యాప్తంగా విపరీత వాతావరణ పరిస్థితులు చూస్తున్నాము. కొన్ని ప్రాంతాలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ప్రపంచంలో చల్లగా ఉండే ప్రదేశాలలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగా ఉండే ప్రాంతాలలో వరదలు, వర్షాలు నమోదవుతున్నాయి.

ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీస్ వారి నివేదిక ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు గత మూడు వారాలలో నమోదయ్యాయి. ఎన్నడూ లేనంతగా ఈ జూలై ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మానవ చరిత్రలోనే ఇది అధిక వేడి వాతావరణం అంటూ వ్యాఖ్యానించారు. ఐరోపాలో, అమెరికాలో విపరీత ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా దాటి, సముద్ర ఉపరితలంపై కూడా వేడిని పుట్టించాయి. భూమి విధ్వంసక స్థితికి చేరుకోబోతోందని, రాబోయే సంవత్సరాలలో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయితే ఇక గ్లోబల్ బాయిలింగ్ దశకు చేరుకున్నట్లేనని హెచ్చరించారు. అలా జరిగితే ఇక ప్రాణికోటి జీవనానికి, మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మానవాళి నివారణ చర్యలు చేపట్టాలని భూతాపాన్ని తగ్గించాలని సూచించారు.