crimeHome Page SliderNational

చెక్ బౌన్స్ కేసులో రాంగోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో జ్యుడీషియల్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అంతే కాదు అరెస్ట్ వారెంట్ కూడా జారీచేసింది. రాంగోపాల్ వర్మకు చెందిన సంస్థ తమకు ఇచ్చిన చెక్కు బ్యాంకులో చెల్లలేదంటూ 2018లో ఓ కంపెనీ పెట్టిన కేసులో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.జనవరి 21న అంధేరీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) వైపీ పూజారి తీర్పును వెలువరిస్తూ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం రాంగోపాల్ వర్మ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు నిర్ధారిస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించారు. అలాగే, ఫిర్యాదుదారుడికి మూడు నెలల్లోగా రూ.3,72,219 చెల్లించాలని ఆదేశించారు. ఆర్జీవీ ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈ నెల 4న అప్పీల్‌ను తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసేందుకు కూడా నిరాకరించారు. అయితే, ఆర్జీవీ కోర్టుకు హాజరై బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు.