Home Page SliderNews AlertTelangana

బండి సంజయ్‌పై నాన్‌-బెయిలబుల్‌ కేసు.. హైకోర్టుకు కామారెడ్డి రైతులు

ప్రభుత్వ మాస్టర్‌ ప్లాన్‌తో కామారెడ్డి దద్దరిల్లింది. మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి పట్టణ బంద్‌తో వాతావరణం వేడెక్కింది. ఈ రైతుల ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. రైతుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వగా.. బీజేపీ కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. మరోవైపు మాస్లర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రామేశ్వర్‌ పల్లి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. తమను సంప్రదించకుండా భూములను రిక్రియేషనల్‌ జోన్‌గా ప్రకటించడాన్ని రైతులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉందని రైతుల తరఫు న్యాయవాది టి. సృజన్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుత డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ రైతులను ఇబ్బంది పెట్టేలా ఉందన్నారు. ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ ఆలోచనను విరమించుకోవాలని.. రైతుల భూముల జోలికి రావొద్దని కోరారు. మాస్టర్‌ ప్లాన్‌ వెనక్కి తీసుకునేంత వరకూ ఆందోళనలను ఉధృతం చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని రైతులు వార్నింగ్‌ ఇచ్చారు.