ముందస్తు, మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ లేదన్న వైఎస్ జగన్
ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాతో తిప్పికొట్టాలి
ఆగస్టు నాటికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలి
ఈ నెల 13 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం
ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతీ కుటుంబానికీ తీసుకెళ్లాలి
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు ఎల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలతో సీఎం వైయస్ జగన్ సమావేశమై తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ఈ సందర్భంగా ఆయన పుల్‌స్టాప్ పెట్టారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.

మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించే అంశాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. క్యాడర్ అంతా కూడా యాక్టివ్‌గా ఉండాలన్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు 60 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు లేవన్న ప్రచారం నమ్మొద్దని సూచించారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.

మళ్లీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సగం సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం పూర్తి చేశారని తెలిపారు. ఆగస్టు నాటికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలన్నారు. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏవో మాటలు చెబుతున్నారు. ఇటీవల 21 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే మనం 17 స్థానాల్లో గెలిచామన్నారు. టీడీపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఇంతకంటే దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టాలని సూచించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోవడం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోనని ఉద్ఘాటించారు.

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతీ కుటుంబానికీ తీసుకెళ్లాలని సూచించారు. వాలంటీర్లను, గృహ సారధులను మమేకం చేసుకోవాలన్నారు. బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని నెలకు రూ.10 వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల వారిని అర్హులుగా గుర్తించి సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. ఎలాంటి వివక్ష..లంచాలకు తావు లేకుండా రూ.2 లక్షల కోట్లకు పైగా అక్కాచెల్లెమ్మల అకౌంట్లలో నగదు జమ చేశామన్నారు. 84 శాతం అర్బన్ ప్రాంతంలో, 92 శాతం రూరల్ ప్రాంతంలో యావరేజ్‌గా 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగామని వివరించారు. పేదవాడు మిస్ కాకుండా వెరిఫికేషన్ చేసి మరీ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి… ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు.