కార్చిచ్చు నెపంతో నిత్యానంద కబ్జా…
దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో కొంత భాగాన్ని కబ్జా చేయడానికి నిత్యానంద, అతని అనుచరులు ప్రయత్నించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అక్కడ ఇటీవల వ్యాపించిన కార్చిచ్చును ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడి, అక్కడి భూమిపై కన్నేశారు. అక్కడి స్థానిక గిరిజన తెగలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. 2 లక్షల డాలర్లకు దాదాపు ఢిల్లీకి మూడింతల ప్రదేశాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా వారి నాయకులను ఒప్పించారు. అంతేకాక వారు వెయ్యేళ్ల లీజుతో పాటు, సహజవనరుల తవ్వకాలు, ఆకాశమార్గాల వినియోగాలకు కూడా అనుమతులు తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే అక్కడ ప్రభుత్వాధికారులు ఈ ఘటనతో సంబంధమున్న 20 మందిని అరెస్టు చేసి, వారి సొంత దేశాలైన భారత్, చైనా, అమెరికాలకు పంపినట్లు తెలుస్తోంది. వీరు తాము కైలాసకు చెందినవారమని చెప్పినట్లు సమాచారం. భారత్‌కు చెందిన నిత్యానంద స్వామి లైంగిక వేధింపులు, చిన్నారుల అపహరణ వంటి కేసులలో చిక్కుకుని, దేశం నుండి పారిపోయి అజ్ఞాతంలో ఉండిపోయారు. కొన్నాళ్ల తర్వాత తాను కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నానని, తానే దేవుడినని ప్రకటించారు. ఈ ప్రదేశం ఈక్వెడార్ సమీపంలోని ఒక చిన్న దీవి అని తెలుస్తోంది.