తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త టెన్షన్
పొత్తుల నేపథ్యంలో టికెట్లు రావని పరేషాన్
అధికార పార్టీ నుండి వలసల నేపథ్యంలో మొదలైన గుబులు
తమ సీటు ఎక్కడ చేజారి పోతుందో అని టెన్షన్
అధిష్టానం వద్ద మార్కులు పొంది సీట్లు కాపాడుకునే ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీలో చేరేందుకు అధికారపక్షం నుంచి వస్తున్న వలసలు, ఇంకోవైపు పొత్తుల భయంతో ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతల్లో కొత్త గుబులు మొదలైంది. ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు నేతల్లో కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ అధినేత స్వయంగా వెల్లడించడం ఆ పార్టీ నేతలను మరింత టెన్షన్ లోకి నెట్టింది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేయటానికి కొంతమంది అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి ఉంది, వీరిలో ఈ టెన్షన్ పెద్దగా లేనప్పటికీ ఇంకా అధిష్టానం అనుగ్రహం పొందని నేతలు మాత్రం భవిష్యత్తు భయంతో ఉన్నారు.అధికార పార్టీ నుంచి వలసలు పెద్ద ఎత్తున ఉంటే తమ సీటు ఎక్కడ చేజారి పోతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు వైయస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చి తిరుగుబావుట ఎగరవేశారు.

ఇదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో నడుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు కొంత ఆందోళనకు లోను అవుతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇంకోవైపు పొత్తుల భయం కూడా నేతల్లో ఇంకా తొలగిపోని పరిస్థితి ఉంది. జనసేనతో మైత్రి బంధం దాదాపుగా ఖరారైన ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడం వారిని గందరగోళంలోకి పడవేసింది. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతలు పార్టీ కార్యక్రమాలు నిర్వహణను భుజాలపై వేసుకొని అధిష్టానం దృష్టిలో పడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. పొత్తులు ఖరారు అయితే తమ భవిష్యత్తు తేలనున్న పరిస్థితి దాదాపుగా ఉండటంతో ఇప్పుడు స్పీడ్ పెంచి చంద్రబాబు వద్ద మార్కులు పొంది సీట్లు కాపాడుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో పొత్తులు ఉంటాయన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతుంది. దీనికి తోడు అధికార పార్టీపై ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని పదేపదే చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తులు ఈ చర్చకు దారి తీసిన పరిస్థితులను ఏర్పరిచాయి.

తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు కన్నా ఎక్కువ డిమాండ్ ఉండటంతో పాటు ఒక్కొక్క స్థానానికి భారీగా ఆశావహులు అన్నారు. వీరంతా సీటు కోసం అనేక రకాల ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటికే 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మళ్లీ సీట్లను ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. అలాగే మరో పదహారు మందికిపైగా అభ్యర్థులను చంద్రబాబు లోకేష్ తమ పర్యటనలు యాత్రలలో బహిరంగంగా ప్రకటించారు. నియోజకవర్గం ఇంచార్జిల సమావేశాల్లో దాదాపు 40 మందికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాచరణను రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. రాజకీయ నేపథ్యం ఉన్న ప్రముఖుల కుటుంబాలకు చెందిన వ్యక్తులు వారి వారసుల చూపు ఇప్పుడు తెలుగుదేశంపై పడింది. వీరిలో కొందరు పార్లమెంట్ టికెట్లను ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పొత్తుల అంశంపై స్పష్టత లేకపోవడంతో ఆ పార్టీ నేతలు టికెట్ దక్కదేమో అని కలవరపాటుకు గురవుతున్నారు.