తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం
• మూడున్నర సంవత్సరాలుగా అభద్రతాభావంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు
• నారా లోకేష్ పాదయాత్ర మొదలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెరిగిన జోష్
• కార్యకర్తల్లో పెరిగిన ఆత్మస్థైర్యం
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మొన్నటిదాకా నీరసంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం కుప్పంలో ప్రారంభించిన పాదయాత్ర కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు వారి అనుచరులు తరలి వెళ్లారు. మూడు సంవత్సరాల ఎనిమిది నెలల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆ పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోయింది. అంతేకాకుండా ఆ పార్టీ తన ఉనికినే కోల్పోయే దశకు చేరుకుంది. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి తెలుగుదేశం పార్టీ గురయింది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కనీసం తన ఉనికిని చాటుకోలేకపోయింది. అప్పటినుంచి రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పైన అభివృద్ధి పైన కనీసం ప్రజల తరఫున పోరాడి వారికి అండగా నిలవలేకపోయింది. ఎవరైనా ఎక్కడైనా నాయకులు అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపైన కేసులు బనాయించటం, జైల్లో పెట్టడం చేయటంతో అభద్రతాభావానికి గురైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మిన్నుకుండిపోయారు. తాజాగా రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో చావో రేవో అనే రీతిలో తేల్చుకునే దశకు చేరింది. ఈ దశలో లోకేశ్ యాత్ర పార్టీ నేతల్లో ఉత్సాహం, కార్యకర్తల్లో ఊపును తీసుకొస్తోంది.

2014 ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుని నమ్మి ఓట్లేసి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. అనంతర కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలిపోయింది. అదే సమయంలో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వేడుకుంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఎన్నో హామీలను గుప్పించారు. అనంతరం ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అంతవరకు బాగానే ఉన్నా 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన జగన్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటినుంచి రాష్ట్ర నాయకులతోపాటు జిల్లాలలోని నాయకుల కూడా మానసిక స్థైరాన్ని కోల్పోయారని విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లోని ఇన్చార్జిలు గాని మండలాల బాధ్యులు గాని నమ్ముకున్న పార్టీ శ్రేణులకు అండగా నిలబడలేక పోవడం కాకుండా వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతున్న కూడా ఏమాత్రం ఆదుకోలేకపోయారని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికలు ఏడాదిపైన ఉండగానే తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరచాలని ఉద్దేశంతో నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.

ఏపీవ్యాప్తంగా వాడ వాడలా యువగళం పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుంది. దీంతోపాటు కుప్పం లో జరిగిన లోకేష్ సభలో ఆయన ప్రసంగించిన తీరు కూడా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిందని అంటున్నారు. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండండి అని ఆయన పిలుపునివ్వడంతో గ్రామస్థాయి కార్యకర్తల్లో కూడా ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 400 రోజులపాటు కొనసాగే పాదయాత్రలో లోకేష్ ఏమేమి కొత్త హామీలు ఇస్తారో ప్రభుత్వ పరిపాలనపై ఎలాంటి విమర్శలు చేస్తారో ప్రజలను ఎలా మెప్పించే ప్రయత్నం చేస్తారో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

