కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రేపే బాధ్యతలు
జాతీయ పార్టీలో రేపు ఓ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. చాలా సంవత్సరాల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఖర్గే స్వీకరించనున్నారు. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఖర్గే స్వీకరిస్తారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేతలతోపాటు ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను ఆహ్వానించనున్నారు.