‘ఆయాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?’..ఈ ప్రమాదాన్ని తెలుసుకోండి.
మహిళలు ఆయాసం, నీరసం, నిసత్తువ, వికారం, కళ్లు తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ప్రమాదం ముంచుకొస్తున్నట్లే. ఈ లక్షణాలు చాలామంది మహిళలలో గుండెపోటుకు సంకేతాలుగా చెప్తున్నారు వైద్యులు. ఈమధ్యకాలంలో నలభై ఏళ్లలోపు మహిళలలో కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగింది. గుండెపోటు మాత్రమే కాదు ఇలా మరణిస్తున్నవారిలో ముగ్గురులో ఒకరు గుండె స్తంభన కారణంగా మరణిస్తున్నట్లు తేలింది. గుండె స్తంభన వల్ల రక్తసరఫరా నిలిచిపోయి స్పృహ తప్పి, నిమిషాలల్లోనే ప్రాణాల మీదికి వస్తోంది. మగవారిలో, ఆడవారిలో గుండెపోటు హెచ్చరికలు విభిన్నంగా ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. మగవారు ఛాతీనొప్పికి గురవుతుంటే, ఆడవారిలో మొదట ఆయాసంగా మొదలవుతోందని పేర్కొన్నారు. చాలామంది నీరసం, బలహీనతలుగా భ్రమపడుతుంటారు. దీనివల్ల గుండెజబ్బును తొలిదశలో గుర్తించలేకపోతున్నారు. మహిళలకు మరింత జాగ్రత్త అవసరం.
చాలామంది మహిళలు కుటుంబసభ్యుల ఆరోగ్యం గురించి తీసుకున్న శ్రద్ధ తమ విషయంలో తీసుకోరు. వారు జీవనశైలికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వంటి పనుల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు అదుపులో పెట్టుకోవాలి. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా ముఖ్యమే.