ఆస్కార్ వేదికపై తెలుగు గళంలో ‘నాటు’ సాంగ్
మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు వేదికలలో తెలుగు గాయకులు తమ గళం వినిపించబోతున్నారు. ఇది విశేష గౌరవంగా చెప్పుకోవచ్చు. తెలుగు గాయకులు ‘కాలభైరవ’, ‘రాహుల్ సిప్లిగంజ్’ నాటు నాటు పాటను వేదికపై పాడబోతున్నారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో RRR సినిమా నుండి ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.

హాలీవుడ్ చిత్రాలలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘అప్లాజ్’, ‘లిఫ్ట్ మి అప్’ వంటి పాటలతో పాటు వేదికపై లైవ్ షో ఇచ్చే అవకాశం మన తెలుగుపాటకు కూడా దక్కింది. ఈ పాటకు ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ‘గోల్డెన్ గ్లోబ్’, ‘క్రిటిక్స్ ఛాయిస్’, ‘హాలీవుడ్ క్రిటిక్స్’ అసోషియేషన్ వంటి గొప్ప అవార్డులను సాధించి ప్రేక్షకుల ఫేవరేట్‌గా మారింది. భారత ప్రజలందరూ మన భారతీయ సినిమాకు ఆస్కార్ సాధించి పెట్టగలదని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగబోతోంది.