InternationalNewsNews Alert

BLACK HOLE సౌండ్ విందామా..

ఈ అనంతవిశ్వంలో అంతులేని రహస్యాలలో కృష్ణబిలం ఒకటి. BLACK HOLE  అని శాస్త్రవేత్తలు పిలుచుకునే ఈ పదార్థం నిజానికి పదార్థమే కాదు. నక్షత్రంలోని మొత్తం రేడియోధార్మికత శక్తి క్షీణించి, చివరకు మిగిలిన అనంతమైన గురుత్వాకర్షణ శక్తినే (GRAVITY) బ్లాక్‌హోల్ అంటారు. ఈ విశ్వంలో కాంతి కన్నా వేగంగా ప్రయాణించే వస్తువు ఏదీలేదు. సెకనుకు మూడులక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా బయటకు పోకుండా చేయగల గురుత్వాకర్షణ ఈ కృష్ణబిలం సొంతం.  కాంతి కూడా దీనిగుండా ప్రయాణించలేదు కాబట్టే దీనిని బ్లాక్‌హోల్ అంటారు.

నాసా(NASA) శాస్త్రవేత్తలు తొలిసారిగా శాస్త్రీయ పద్దతిలో దీనికి శబ్ధరూపమిచ్చారు. దీనికోసం 2003లో సేకరించిన ఒక బ్లాక్‌హోల్ డేటాను ఉపయోగించి దాని కేంద్రం నుండి అన్ని వైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్దరూపంలో మార్చి విడుదల చేసారు. సైన్సును అందరికీ చేరువ చేసే ఉద్దేశ్యంతోనే ఈ కృషి చేసినట్లు నాసా తెలిపింది. ఈశబ్దం అచ్చంగా మన హారర్ సినిమాలలో వినిపించే శబ్దం వలే భయంకరంగా హూం హూం అంటూ వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీనిని స్పష్టంగా వినవచ్చు. కానీ శబ్దం శూన్యంలో ప్రయాణించదని మనందరకూ తెలిసినదే. అంతరిక్షం అంటేనే శూన్యం. కానీ పాలపుంతలు, మిల్కీవేల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే బ్లాక్ హోల్ ఒత్తిడి తరంగాలకు నాసాకు చెందిన చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపం ఇచ్చింది. శాస్త్రవేత్తల కృషి చాలా ప్రశంసనీయం కదూ..