నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్ట్ లో ఉన్న నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకు ఒక రకంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుతో డీలాపడ్డ ఆ పార్టీ కార్యకర్తలలో మళ్లీ సమరోత్సహాన్ని నింపేందుకు అగ్ర నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ వారంలో వరుస కార్యక్రమాల నిర్వహణకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది.

ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈనెల 5వ తేదీ నుంచి ఆమె రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని భావించినప్పటికీ చంద్రబాబు కేసులు ఇతర సాంకేతిక అంశాల దృష్ట్యా ఇది కాస్త వాయిదా పడింది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజం గెలవాలి పేరిట ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలానే చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సమావేశాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు కావడంతో ఈ కార్యక్రమం కాస్త నిలిచిపోయింది. ఇప్పుడు ఈ బాధ్యతను పార్టీ యువ నేత నారా లోకేష్ తన భుజాలపై వేసుకొనున్నారు. నిలిచిపోయిన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన పున ప్రారంభించనున్నారు. మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మానిఫెస్టో అంశాలపై లోకేష్ స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

