నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి..
ఎడతెగకుండా ప్రతిరోజూ పడుతున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని నదులన్నీ ఉరకలెత్తుతున్నాయి. దీనితో నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో నిడమనూరు మండలం భయం గుప్పెట్లో ఉంది. ఇప్పటికే మూడు గ్రామాలు నీట మునిగాయి. నిడమనూరు మినీ గురుకుల పాఠశాల కూడా నీట మునిగింది. పెద్దవూరకు చెందిన 87 మంది విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు . గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మట్టికట్ట బలహీన పడటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో కాల్వలోకి సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతు ఇచ్చిన సమాచారంతో అధికారులకు అసలు విషయం తెలిసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నీటి విడుదల ఆపేశారు.

సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు విడుదల చేసిన నీరు పూర్తిగా గండి ద్వారానే వృథా అయ్యే అవకాశం ఉంది. శివారు ప్రాంతంలో ఉన్న పొలాల కోసం నీటిని విడుదల చేశారు. ఇప్పుడు ఆ నీరు ఆ రైతులకు చేరక పోగా… గండిపడిన ప్రాంతంలోని ముప్పారం, గంటుకగూడెం, నర్సింహుల గూడెంలలో వందల ఎకరాల్లో పొలాలు మునిగిపోయాయి, భారిగా పంట నష్టం జరిగింది. ఇంకా ఎన్ని ప్రాంతాల్లో పొలాలు నీట మునుగుతాయోనని రైతులు భయందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజుల్లో గండిని పూర్తిగా పూడ్చివేస్తామని నాగార్జునసాగర్ సిఈ శ్రీకాంత్ చెప్పారు.
ఇక జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత ప్రాంతంలోని విద్యార్థులను, నిడమనూరులోని 20 కుటుంబాలను తరలించామని తెలిపారు. హాలియా డైవర్షన్ నుంచి వాగులోకి వదులుతున్నామని చెప్పారు. ఉదయం వరకు నీరు మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మినీ గురుకులాన్ని రేపు ఉదయం శానిటేషన్ చేసి, తిరిగి పాఠశాలలోకి విద్యార్థులను పంపిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

