Andhra PradeshNewsNews Alert

మునుగోడులో చిత్రం భలారే విచిత్రం

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రాజకీయాలు ఊహకు అందని విధంగా సాగుతుంటాయ్. నేరుగా పాయింట్‌లోకి వస్తే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది. మాకు కూడా ఉపఎన్నికలు వస్తే బాగుండని రెండు రాష్ట్రాల్లోని జనం కోరుకునే అంతగా అక్కడ పరిణామాల గురించి వార్తలు పుంకాను పుంకాలుగా వస్తూనే ఉన్నాయ్. మునుగోడులో ఇప్పుడు ఓటు ఉందంటే వారికి ఒక పండుగ. ఇక ఉమ్మడి కుటుంబం ఐతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఓటు సామాజిక బాధ్యతగా జనం భావించేవారు. సేవ చేస్తారనుకున్న అభ్యర్థిని ఎన్నికల్లో ప్రజలు గెలిపించేవారు. రాను రాను పరిస్థితుల్లో మార్పు వస్తోంది. అధినేత వల్లనో, పార్టీపై ఉన్న ప్రేమతోనూ ఓట్లు వేస్తూ వచ్చారు. కానీ నేతలు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో తనకు నచ్చని పార్టీకి గుడ్ బై చెప్పి.. మరో పార్టీలో చేరే ముందు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆదర్శంగా నిలిచారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీ నుంచి బరిలోకి దిగారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గం కోసం 2 వేల కోట్లు ఇస్తే రాజీనామాకు సిద్ధమంటూ గతంలో అధికార పార్టీకి ఆయన సవాల్ కూడా విసిరారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవి త్యాగానికి సిద్ధమన్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందనే కరువయ్యింది. కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. నియోజకవర్గం అభివృద్ధి ఐనా జరుగుతుందని భావించిన రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని భావించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని కాదని.. కమలం పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పది మందికి పైగా ఎమ్మెల్యేలు, సిగ్గూ, ఎగ్గూ లేకుండా రాజీనామా ఊసెత్తకుండా గులాబీ కండువా కప్పేసుకున్నారు. కొందరు మంత్రి పదవులు కూడా వెలగబెడుతున్నారు. కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ రాజగోపాల్ రెడ్డి… దైవం ఎది తలస్తే అది జరుగుతుందన్న దీమాతో ఎన్నికల బరిలో నిలిచారు. ఈటల తరహాలోనే రాజగోపాల్ రెడ్డిని కూడా ఫినిష్ చేస్తామని భావించిన అధికార పార్టీ సై అందింది. రాజీనామా చేయడం ఆలస్యమన్నట్టుగా స్పీకర్ ఆమోదం చెప్పడం.. ఎన్నికల నోటిఫికేషన్ రావడం అన్నీ చకచకా జరిగిపోయాయ్.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించినా… రాజగోపాల్ రెడ్డి అఖండ విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కూసుకుంట్లపై సుమారుగా 24 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పోలైన ఓట్లలో 50 శాతం పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కన్పించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కూసుకుంట్ల మళ్లీ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగితే… కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీకి దిగారు. ఎన్నికలంటే ఒక ప్యాషన్, రాజకీయాలంటే వళ్లమాలిన ప్రేమ కలిగిన రాజగోపాల్ రెడ్డి… 2014లో మినహా.. ఆయన పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చారు. గెలిచిన ప్రతీసారి అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎన్నికను ఒక సవాల్‌గా తీసుకొని పనిచేయడం రాజగోపాల్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యం. నియోజకవర్గంలో హైప్ తీసుకురావడంలో ఆయనకు మించి ఎవరూ ఉండరని ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనం బాగా చెప్పుకుంటారు. ఏదైనా చేయాలంటే అది కోమటిరెడ్డి బ్రదర్స్ అయితేనే సాధ్యమని వారందరూ భావిస్తుంటారు. మునుగోడు ఎన్నికలో గెలిచి తీరాలని కోమటిరెడ్డి సర్వశక్తులు ఒడ్డుతుంటే.. టీఆర్ఎస్ అంతకు పదింతలు ఎఫర్ట్స్ పెడుతోంది.

హుజూరాబాద్ ఎన్నికల ఓటమి తర్వాత, మరో ఛాన్స్ ఇవ్వకూడదని.. గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ బుత్ వరకు వెళ్లి ఓటు వేయించేలా నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకగణం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలను కలుస్తూ.. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తోంది. ఒకరంగా చెప్పాలంటే 77 ఎంపీటీసీ వార్డుల్లో మంత్రి స్థాయి ఉన్న నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్కొక్కరి వాటా కింద కేవలం 2 వేల ఓట్లు మాత్రమే ఉండటంతో.. టీఆర్ఎస్ పార్టీకి వచ్చేవి ఎన్ని, బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయ్, కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటన్నదానిపై పూర్తి డేటాతో నేతలు అడుగులు వేస్తున్నారు. 2 వేల మందిని పోలింగ్ జరిగే నాటికి రెండు, మూడు సార్లు కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ సదరు నేత ప్రచారం చేసిన ఏరియాలో ఓట్ షేర్ తగ్గితే ఏమవుతుందో ఈ పాటికే నేతలకు టీఆర్ఎస్ హైకమాండ్ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇలాంటి తరుణంలో కొందరు ఓటర్ల నుంచి వస్తున్న ప్రశ్నలతో గులాబీ తమ్ముళ్లు అవాక్కవుతున్నారు… ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని మధనపడుతున్నారు.

ఓటర్ల దగ్గర్నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. నియోజకవర్గానికి ఇప్పటికైనా వచ్చారు మంచిదేనంటూ స్వాగతం పలుకుతూనే నేతలకు తమ కోర్కెల చిట్టాను విప్పుతున్నారు ఓటర్లు. అసలు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఓటేస్తే మాకేంటని నిలదీస్తున్నారు. దీంతో ప్రచారానికి వచ్చిన నేతలు నోళ్లు వెళ్లబెడుతున్నారు. హుజూరాబాద్ తర్వాత మునుగోడు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకగణానికి అసలు సిసలు పరీక్షలా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఓటర్లు కొందరు క్యాష్ అడుగుతుంటే, మరికొందరు గోల్డ్ బాబు గోల్డ్ అంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఆయా పార్టీల నేతలు ఇళ్లకు వెళ్లి.. ఏం కావాలో చెప్పండి చేస్తాం, ఇస్తామంటుంటే.. జనం ఊరుకుంటారా.. ఇప్పటికే అభివృద్ధిలో వెనకబడినందునే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేస్తోండటంతో… ఆయన రాజీనామా తర్వాత మారిన పరిస్థితులపైనా జనం చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బులతో ఆదుకున్న రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రజలు క్లారిటీతో ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఎన్నికలో అధికార పార్టీని ఓడిస్తే.. గులాబీ పెద్దల అహం తగ్గుతుందని.. నియోజకవర్గానికి మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రోడ్లు కావాలని కొందరు, నీటి సౌకర్యం కల్పించాలని మరికొందరు, గ్రామాన్ని బాగు చేయాలని మరికొందరు చేస్తున్న డిమాండ్లతో టీఆర్ఎస్ పార్టీకి తలబొప్పికడుతోంది.