Andhra PradeshHome Page Slider

జనసేనాని, పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ

పవన్ కల్యాణ్ తనను నమ్మించి మోసం చేశారన్న భావనలో లేఖాస్త్రాన్ని సంధించారు మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం. జాతి కోసం పవన్ కల్యాణ్‌తో తాను కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నప్పటికీ నేటికీ ఆయన నుంచి స్పందన లభించలేదని ఆయన ఆరోపించారు. గతంలో తనకు ఎదురైన బాధలను మరచి, జనసేనతో కలిసి వెళ్లాలనుకున్నానన్నారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కన్పించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ లా తనకు గ్లామర్ లేదన్న ముద్రగడ… టీడీపీని బతికించిన జనసేనకు, ఆ పార్టీ ఇస్తున్న గౌరవం చాలా తక్కువని మండిపడ్డారు. తన విషయంలో టీడీపీ నుంచి క్లారిటీ లేకపోవడం వల్ల ప్రస్తుతం తనతో పవన్ కల్యాణ్ కలవలేకపోయారని ఆయన లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు. తనకు సహకరించకపోవడం, లక్ష్యాలను పంచుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీతో బలమైన పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకోవడంతోపాటు రెండేళ్లుగా ముఖ్యమంత్రి పదవితోపాటు 80 అసెంబ్లీ సీట్లు కూడా దక్కించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదని ముద్రగడ తన లేఖలో విమర్శించారు. ముద్రగడ తన జీవితంలో రాజకీయాల గురించి వివరిస్తూ… పవన్ కల్యాణ్‌ను దెప్పిపొడిచారు. తాను ఎప్పుడూ పెద్ద నాయకుల నుండి డబ్బు లేదా పదవులు అడగలేదని, ఎల్లప్పుడూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేత విలువైన మిత్రుడిగా గుర్తించబడకపోవడం పట్ల తన నిరాశను వ్యక్తం చేశాడు. ముద్రగడ, పవన్ కళ్యాణ్ మధ్య బలమైన రాజకీయ భాగస్వామ్యానికి అవకాశం లేకుండా పోయిందని లేఖలో రాశారు. రాష్ట్రంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసినా… పవన్ కళ్యాణ్ పరిమితుల కారణంగా అది ముందుకు జరగలేదన్నారు. అందుకు పవన్ కల్యాణ్ ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉండటం విచారకరమన్నారు.