ఎంపి ఇంటి దొంగ అరెస్ట్
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ ఇంట్లోకి చొరబడేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. అక్రమ్ గతంలో హైదరాబాద్లోని పాతబస్తీ, దిల్లీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీపీ సీవీ ఆనంద్ ఎంపీ అరుణ ఇంటికి చేరుకుని వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లోని ఎంపీ నివాసంలోని నిందితుడు ముసుగు ధరించి ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించాడు. సుమారు గంటపాటు ఇంట్లో తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె కుమార్తె ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట గది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు. దీనిపై ఎంపీ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

