crimeHome Page SliderNationalPolitics

ఎంపీపై గ్రామస్తుల దాడి..తలకు తీవ్రగాయం..

బీహార్ కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్‌కు ఒక గ్రామంలో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఎంపీపై ప్రజలు ఆగ్రహంతో కర్రలు, రాడ్‌లతో దాడి చేశారు. దీనితో ఆయన తలకు తీవ్ర గాయమయ్యింది. ఆయనను వారణాసిలోని ఆసుపత్రికి తరలించారు. అసలు విషయమేమిటంటే కైమూర్ జిల్లాలో ఉన్న నాథుపురి గ్రామంలో ఎంపీ సోదరుడు వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికలలో గెలిచారు. ఫలితం వెలువడిన వెంటనే ఎంపీ, సోదరుడితో కలిసి ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపులో వారి కార్ల కాన్వాయ్‌లోని ఒక కారు కొందరు గ్రామస్థులను తాకుతూ వెళ్లింది. దీనితో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కారు డ్రైవర్‌పై దాడి చేశారు. దీనితో ఎంపీ అనుచరులు ఎదురుదాడి చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీ మనోజ్ కుమార్ అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పబోగా, అతనిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.