సుప్రీంకోర్టు న్యాయవాదిపై కోతి దాడి
సుప్రీంకోర్టు ఆవరణలో ఓ న్యాయవాదిపై కోతి దాడి చేసింది. న్యాయవాది ఎస్ సెల్వకుమారి గేట్ నెం. జి గుండా ప్రవేశిస్తుండగా ఓ కోతి దాడి చేయడంతో ఆమె గాయాలపాలైంది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను కోర్టు గేట్ నుండి లోపలికి ప్రవేశించాను. అంతలో ఓ కోతుల గుంపులో ఓ కోతి నా తొడను కొరికింది. నేను సహాయం కోరినా అక్కడ రక్షించేవారు కూడా ఎవరూ లేరు. నేను వెంటనే సుప్రీంకోర్టు డిస్సెన్సరీకి వెళ్లాను. అక్కడ ప్రథమ చికిత్స మందులు ఏవీ లేవు’ అని ఆమె పేర్కొన్నారు.
న్యాయవాది స్నేహితులు ఆమెను రిజిస్ట్రార్ కోర్టు సమీపంలోని పాలీక్లినిక్ కు తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది గాయాన్ని మాత్రమే శుభ్రం చేశారు. తర్వాత రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడ ఆమెకు టెటనస్ ఇంజక్షన్ ఇచ్చారు. న్యాయవాది ఎస్ సెల్వకుమారి సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ శాశ్వత సభ్యురాలు. సుప్రీం కోర్టు క్యాంపస్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రాథమిక వైద్య మందులు, నివారణ చర్యలు లేకపోవడంపై సెల్వకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.