ఏడుగురు కేంద్ర మంత్రులకు రాజ్యసభకు నామినేట్ చేయని మోదీ, ఇద్దరికే అవకాశం ఎందుకంటే!?
రెండు సార్లు వరుస విజయాలు. ఒకసారికి మించి మరోసారి భారీ విజయం. దేశంలో ముందెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్న బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరో ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది. రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఈసారి మరో కొత్త స్కెచ్ వేస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రులుగా కొందరికి అవకాశం ఇచ్చిన మోదీ వారిని వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించారు. అయితే ఈసారి మంత్రి పదవితో ఆయా రాష్ట్రాల్లో పలుకుబడి సాధించిన నేతలను ఇప్పుడు లోక్ సభ ఎన్నికల బరిలో నిలవాల్సిందిగా ఆదేశించారట. ఇప్పటికే ఆయా నేతలకు తమకు నచ్చిన నియోజకవర్గాల్లో పోటీ చేసే స్వేచ్ఛను ఇచ్చారట. అందుకే తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదట. ప్రధాని మోదీ స్కెచేంటి? ఆయన ఆలోచనలేంటో ఇప్పుడు చూద్దాం…

ప్రధాని నరేంద్రమోదీ ఏం చేసినా దానికో లాజిక్ ఉంటుంది. దానికో లెక్క ఉంటుంది. మూస ధోరణిలో రాజకీయాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న ప్రధాని మోదీ ఇప్పుడు మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చారు. రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయలేదు. మంత్రులందరినీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గుజరాత్, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్-మధ్యప్రదేశ్, జూనియర్ ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్-కర్ణాటక, పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్-రాజస్థాన్, మత్స్య మంత్రి పర్షోత్తమ్ రూపాలా-గుజరాత్, మైక్రో, చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, జూనియర్ విదేశాంగ మంత్రి వి మురళీధరన్ కూడా రాజ్యసభకు నామినేట్ చేయలేదు. వీరిద్దరూ కూడా మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం ఏడుగురు మంత్రులు వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రం ఒడిశాలోని సంబల్‌పూర్ లేదా ధేక్నాల్ నుండి పోటీ చేయవచ్చు. భూపేందర్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లేదా మహేంద్రగఢ్ నుండి పోటీ చేయవచ్చు. చంద్రశేఖర్ బెంగళూరులోని నాలుగు స్థానాల్లో ఒకదానిలో పోటీ చేయవచ్చు. అదేవిధంగా, మాండవ్య గుజరాత్‌లోని భావ్‌నగర్ లేదా సూరత్ నుండి పోటీ చేయవచ్చు. రూపాలా రాజ్‌కోట్‌ను పోటీకి ఛాన్స్ ఉంది. మురళీధరన్, అదే సమయంలో, తన సొంత రాష్ట్రం కేరళ నుండి పోటీ చేయవచ్చు. బిజెపికి అక్కడ ఉనికి లేదు. ఆయనను ఎన్నికల్లో పోటీకి దింపి అక్కడ్నుంచి పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

బీజేపీ కొందరిని మాత్రమే పెద్దల సభకు తిరిగి పంపించింది. వాస్తవానికి, రాజ్యసభ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులను మాత్రమే కొనసాగించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జూనియర్ ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్-మధ్యప్రదేశ్ నుండి తిరిగి అవకాశమిచ్చారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎంపీ అవకాశం దక్కించుకున్నవారికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. పార్టీ అధినేత జేపీ నడ్డా మాత్రమే ఇందుకు మినహాయింపు పొందారు. అయినప్పటికీ, 2022లో కాంగ్రెస్ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్‌కు మార్చేశారు. ఈ వారం కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పార్టీ అవకాశమిచ్చింది. మొత్తంమీద, మొత్తం 28 మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం నలుగురికి మాత్రమే తిరిగి అవకాశమిచ్చింది. మిగిలిన 24 మంది లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి రావాల్సిందిగా కోరింది. ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు 28 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ఎక్కువగా కొత్తవారికి అవకాశమిచ్చింది. నాయకత్వ నిర్మాణం, అట్టడుగు స్థాయి కార్యకర్తలను, ప్రజలకు తెలియని వారిని కూడా ఈసారి సామాజిక సమీకరణాల ఆధారంగా అవకాశం ఇచ్చింది.

వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా ముగ్గురు మహిళా విభాగం నేతలకు ఈసారి అవకాశమిచ్చింది. ధర్మశీలా గుప్తా- బీహార్, మేధా కులకర్ణి-మహారాష్ట్ర, మాయా నరోలియా-మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు కొత్త సభ్యులను పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. మహిళా ఓటర్లపై ప్రభావం చూపించేలా పార్టీ వీరికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి కొత్త ఆలోచనలను తెరపైకి తెస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికలలో.. పలువురు లోక్ సభ సభ్యులను బరిలో దించింది. అసెంబ్లీ ఎన్నికలకు లోక్‌సభ ఎంపీలను నిలబెట్టి విజయం సాధించింది. ఆ ప్లాన్ బాగా పనిచేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను గెలుచుకొంది. హిందీ హార్ట్ బెల్ట్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రిపరేషన్‌లో బీజేపీ పూర్తిగా నిమగ్నమైంది. అభ్యర్థుల నియామకంతో సహా వ్యూహాలను రూపొందించేందుకు గత నెలలోనే జాతీయ ప్రధాన కార్యదర్శులు ప్రతి మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వరుసగా మూడోసారి తిరిగి విజయం సాధించేందుకు ఫస్ట్ టైమ్ ఓటర్లు, కేంద్ర పథకాల లబ్ధిదారులు, వెనుకబడిన తరగతుల ఓటర్లతో పాటు యువకులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటామని పార్టీ పేర్కొంది. ఆ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డా పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.