NewsTelangana

12న తెలంగాణాకు మోదీ

ప్రధాని మోదీ నవంబరు 12వ తేదీన తెలంగాణాలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గతంలో మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.6,120 కోట్లతో పునర్‌ నిర్మించింది. గత ఏడాది మార్చి 22వ తేదీనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఈ కర్మాగారాన్ని ప్రధాని మోదీ ఇప్పుడు జాతికి అంకితం చేయనున్నారు. మోదీ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర ఎరువులు, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్‌ సింఘాల్‌, కేంద్ర ఎరువుల శాఖ అధికారులు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌, రామగుండం పోలీసు కమిషనర్‌ పరిశీలించారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రధాని సభలో కేసీఆర్‌ పాల్గొంటారా..?

అయితే.. ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారో.. లేదో.. అనే విషయం ఆసక్తికరంగా మారింది. మోదీ గతంలో తెలంగాణాకు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాల్లో కేసీఆర్‌ సీఎం స్థాయిలో పాల్గొనలేదు. అందుకు కారణాలు కూడా చెప్పారు. ఇప్పుడు నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర వివాదం.. కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టడం.. వంటి కారణాల రీత్యా బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్‌కు విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఇప్పుడు ప్రధాని కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొనే అవకాశమే లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.