NewsTelangana

మోదీ వచ్చారు.. అసలు ఆట మొదలయ్యింది… !

టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా పరిస్థితులు
తెలంగాణ స్పష్టంగా కన్పిస్తున్న ప్రజాభిప్రాయం
వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీకి ఓటేయాలన్న భావన
మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో క్లారిటీ
అన్ని మంచిశకునములే అంటున్న బీజేపీ
తెలంగాణలో ఇక పోరు టీఆర్ఎస్ Vs బీజేపీయే!

మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయోనన్న ఉత్కంఠ అటు రాజకీయ నేతల్లోనూ ఇటు సామాన్య జనంలోనూ ఉంది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మొత్తం వ్యవహారం మారిపోతుందని.. టీఆర్ఎస్ పార్టీ మరింత డిఫెన్స్‌లో పడుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉండేది. ఐతే మనుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓటమి పాలైనప్పటికీ… తెలంగాణ గ్రౌండ్ రియాల్టీ మారిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైనప్పటికీ.. బీజేపీ సత్తా ఏంటో అర్థమవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన గెలిచేస్తారేమోనని టీఆర్ఎస్ పార్టీ నేతలకు కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు.. మునుగోడు జనం సైతం ఉపఎన్నికల విషయంలో అనుసరించిన వైఖరి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఓటుకు నోటు అంటూ సాగిన మొత్తం ఎన్నికల పర్వం.. వచ్చే రోజుల్లో రాజకీయాలను ఓటరు ఎంతగా రక్తికట్టించబోతున్నాడో సుస్పష్టమవుతోంది.

మునుగోడు ఉపఎన్నిక తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సైతం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగిస్తామంటూ మోదీ గర్జించడంతో వచ్చే రోజుల్లో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు వస్తాయన్న భావనలో ఆ పార్టీ నేతలున్నారు. తెలంగాణలో గెలిచి తీరాలని భావిస్తున్న కమలనాథులు అందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. కమలం పార్టీలోకి మిగతా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తాయని భావిస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ ఎలా అన్న తర్జనభర్జనలో పార్టీ ఉంది. తెలంగాణలో అధికార పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే వరకు నేతలు వేచి చూసే ధోరణిలో ఉంటారని భావించాం. ఐతే మునుగోడు ఉపఎన్నిక సమరం తర్వాత నేతల ఆలోచనల్లో మార్పు మొదలైందని బీజేపీ నమ్ముతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఓడించనక్కర్లేదని.. ఆ పార్టీయే ఓడిపోతుందన్న విశ్వాసంతో బీజేపీ నేతలున్నారు.

మునుగోడులో వంద మంది నేతలు, ముఖ్యమంత్రితోపాటు కేటీఆర్, హరీశ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు ప్రచారం చేస్తే… కేవలం 10వేల ఓట్ల ఆధిక్యమే వచ్చిందని.. ఇది పార్టీకి ప్రతికూల సంకేతమన్న భావన వ్యక్తమవుతోంది. ఇంత మంది నేతలు రంగ ప్రవేశం చేయకుంటే బీజేపీయే గెలిచేదేనన్న అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గం వారికి ముఖ్యమవుతోందని.. అప్పుడు పెద్దగా తమకు పోటీ ఉండదని బీజేపీ నేతలు తాజాగా భావిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం.. ప్రజల్లో విశ్వసనీయత పొందడం ఈసారి సాధ్యం కాదని బీజేపీ తలపోస్తోంది. మంత్రులు, కీలక నేతలు ప్రచారం చేసిన ఆయా ప్రాంతాల్లో బీజేపీకి లీడ్ రావడంతో కేసీఆర్ సైతం కన్ఫ్యూజన్లో ఉన్నారన్న చర్చ పార్టీ వర్గా్లో విన్పిస్తోంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ అనున్నదొకటి.. అయ్యిందొకటన్న పరిస్థితి… పార్టీలో స్పష్టంగా కన్పిస్తోంది. బీజేపీకి ఇంతలా ప్రజల్లో ఆదరణ ఉందా అని కేసీఆర్ టెన్షన్లో ఉన్నారట.

మునుగోడు ఫలితానికి ముందు మరో ఉపఎన్నిక వస్తే.. ఈసారి కేసీఆర్‌కు చుక్కలు చూపించాలని బీజేపీ భావిస్తోందట. అయితే ప్రస్తుతానికి ఎన్నికలు వచ్చే అవకాశం ఎంత మేరకు ఉందన్నది చూడాల్సి ఉంది. వేములవాడ ఎన్నిక వ్యవహారంలో ఎన్నిక జరుగుతుందని భావిస్తున్నా.. అక్కడ ఎన్నికలు ఇంకో ఏడాది మాత్రమే ఉండటంతో సెకండ్ పొజిషన్లో ఉన్న నేత ఎమ్మెల్యేగా ప్రమోట్ అవుతారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డి తరహాలో బీజేపీపై అంత నమ్మకంగా ఎన్నికల్లో వెళ్లేందుకు ఏ నేత సహసం చేస్తాడోనన్నది చూడాల్సి ఉంది. రాజకీయాలంటే ఎత్తుపల్లాలన్న విషయం తెలిసిందే. కానీ కేసీఆర్ తీరు కొంత మేర ఊహకు అతీతంగా ఉంటుంది. మునుగోడు తర్వాత కేసీఆర్ తక్షణం అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని కూడా అందరూ భావించారు. కానీ కేసీఆర్ అలా చేసే అవకాశం ప్రస్తుతం కన్పించడం లేదు.

మునుగోడులో బీజేపీ ఇచ్చిన ఫైటింగ్ చూశాక.. లోటుపాట్లను సరిచేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ గుండె చప్పుడు… టీఆర్ఎస్ అనుకుంటున్న తరుణంలో ఎన్నికల్లో వచ్చిన ఫలితం ఆ పార్టీని షాక్‌ కలిగించింది. ప్రజల ఆలోచనల్లో మార్పు రావడానికి కారణమేంటని ఆ పార్టీ మథనపడుతోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే తమకు కలిసి వస్తోందన్న ఈక్వేషన్లు సైతం నిజం కావని ఇప్పుడిప్పుడు గులాబీ పార్టీ అర్థం చేసుకుంటోంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకం మొదలైందన్న రియాల్టీలోకి గులాబీ దండు వచ్చేసింది. సంక్షేమ పథకాలు ఇప్పుడందిస్తున్న తరహాతో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు. ఇలాంటి నేపథ్యంలో కొత్త స్కీములు తీసుకురావడం సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. మరోవైపు బీజేపీ తరుముకొస్తోంది. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయ్. ఈ మొత్తం పరిణామాలన్నీ.. టీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయ్.

ఈ పరిణామాలన్నీ తమకు కలసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. స్వతహాగా పార్టీకి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆదరణ రాకున్నా.. ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తోండటంతో.. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారతాయని స్థానిక నాయకత్వంతోపాటు, జాతీయ పార్టీ సైతం లెక్కలు వేసుకుంటుందట. ప్రధాని మోదీ తాజాగా తెలంగాణ పర్యటనలోనూ పార్టీ నేతలకు భవిష్యత్ మనదేనన్న భావన కలిగించారు. అధికారం మనదేనన్న బలమైన నమ్మకాన్ని పార్టీ నేతలకు, కార్యకర్తలకు కలిగించారు. ప్రధాని సూచనలు, ఆదేశాలతో… పార్టీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని.. అడుగులు వేయాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీకి మరింత బెనిఫిట్ కలుగుతుందని… తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ ప్రభావం దక్షిణాదిలోనూ ఉంటుందని ఆ పార్టీ విశ్వసిస్తోంది.