Home Page SliderInternational

రష్యా ఆర్మీ నుండి భారతీయులను విడిపించిన మోదీ

రష్యాకు వివిధ ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన భారతీయులు అక్కడ ఆర్మీలో పనిచేయవలసిన పరిస్థితిలో పడ్డారు.  వారిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ప్రధాని మోదీ చేసిన కృషి ఫలించింది. వారిని యుద్ధ విధుల నుండి తొలగించి, భారత్‌కు పంపడానికి అంగీకారం కుదిరింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వారంతా రష్యా తరపున సైన్యంలో సహాయకులుగా పనిచేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరి భేటీలో భాగంగా భారతీయులకు రష్యా సైన్యం నుండి విముక్తి కలిగించమని మోదీ రష్యా అధ్యక్షుని కోరారు. దీనికి పుతిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ఈ విషయం ప్రస్తావనకు రాగా, రష్యా అధినేత వారిని విధుల నుండి తప్పించి, భారత్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు చనిపోయారని సమాచారం.

గతంలో కేంద్ర విదేశాంగ శాఖ చొరవతో కొందరు భారతీయులు సురక్షితంగా వచ్చారు. ఇంకా 50 మంది భారత యువకులు ఈయుద్ధంలో ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో మోదీ అనేక అంశాలపై చర్చలు జరిపారు. దేశాల మధ్య సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని, సామరస్యంగా చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం చేసుకోవాలని మోదీ, పుతిన్‌కు సూచించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి. కాగా మూడవసారి ప్రధానిగా ఎన్నికైన మోదీని పుతిన్ ఎంతగానో అభినందించారు. ఇది సాధారణ విజయం కాదని, మీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తాడు.