45 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్లలో భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు కూడా వెళ్లనున్న ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం వార్సాలో అడుగుపెట్టారు. మొరార్జీ దేశాయ్ 1979లో పోలాండ్ సందర్శించిన చివరి ప్రధానమంత్రిగా ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును మోదీ బ్రేక్ చేశారు. వార్సాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ, అధ్యక్షుడు ఆండ్రెజ్ సెబాస్టియన్ దుడాతో సమావేశమవుతారు. ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 1940వ దశకంలో రెండో ప్రపంచ యుద్ధంలో 6,000 మందికి పైగా పోలిష్ మహిళలు, పిల్లలు భారతదేశంలోని రెండు రాచరిక రాష్ట్రాలైన జామ్‌నగర్, కొల్హాపూర్‌లలో ఆశ్రయం పొందిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ వార్సాలోని స్మారక చిహ్నాలను కూడా సందర్శించాల్సి ఉంది. ప్రధాన మంత్రి మోదీ 25 వేల మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలిష్ వ్యాపారవేత్తలు, భారత సంస్కృతి సంప్రదాయలపై పరిశోధనలు చేసిన నిపుణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుని హోదాలో ప్రధాని మోదీ పోలిష్ ప్రధానితో ఇప్పటికే నాలుగుసార్లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను తరలించడంలో పోలాండ్ సాయాన్ని మోదీ అభినందించనున్నారు. పోలాండ్‌కు వెళ్లే భారతీయ పౌరులకు వీసా నిబంధనలను సడలించినందుకు ధన్యవాదాలు తెలుపనున్నారు. మార్చి 2022లో ప్రెసిడెంట్ డూడాతో టెలిఫోనిక్ సంభాషణ కూడా చేశారు. 2022లో 4000 మందికి పైగా భారతీయ విద్యార్థులను పోలాండ్ మీదుగా ఇండియాకు తీసుకొచ్చారు. ఇరుదేశాల దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోలాండ్, భారతదేశానికి కీలకమైన ఆర్థిక భాగస్వామి అంటూ మోదీ ఇవాళ ట్వీట్ చేశారు. పోలాండ్, ఉక్రెయిన్‌లలో PM మోదీ పర్యటనను ప్రకటిస్తూ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం, ” ఇరుదేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా ఉంది. ఇది US $ 6 బిలియన్లు. ఇది మధ్య, తూర్పు దేశాలలో పోలాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. ఐరోపాలో భారతీయ పెట్టుబడులు సుమారు $3 బిలియన్లు.

భారతదేశంలో పోలాండ్ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. “చాలా భారతీయ కంపెనీలు పోలాండ్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. IT, ఫార్మాస్యూటికల్స్ తయారీ నుండి, వ్యవసాయ వాహనాల వరకు ఎలక్ట్రానిక్స్, స్టీల్, మెటల్స్, కెమికల్స్ వరకు అనేక రంగాలలో కీలకంగా ఉన్నారు. దాదాపు 30 పోలిష్ కంపెనీలు భారతదేశంలో వ్యాపార లావాదేవీలు నిర్వర్తిస్తున్నాయి. భారతదేశం- పోలాండ్ మధ్య 2019 లో నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభించబడ్డాయి. ఇది ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది” అని MEA కార్యదర్శి తన్మయ లాల్ అన్నారు. ప్రధాని ఆగస్టు 23న కైవ్‌లో పర్యటించి, అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరుపుతారు.

