ఆపరేషన్ చేసి, మహిళను కాపాడిన ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డాక్టర్ గా మరోసారి తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. ఆయన ఓ మహిళకి అరుదైన ఆపరేషన్ చేశారు. మహిళ కడుపులో నుండి 15 కేజీల నీటి కణితి తొలిగించి మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కుంజ రత్తమ్మ (51) తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ నిఖిత హాస్పి టల్ లో జాయిన్ అయ్యారు. స్కానింగ్ చేస్తే 15 కేజీల నీటి గడ్డ ఉన్నట్టు గుర్తించారు. అప్పటికే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న రోగికి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె ప్రాణాలకే అపాయమని గ్రహించిన ఎమ్మెల్యే.. బాధితురాలైన రత్తమ్మకు తన ఆస్పత్రిలోనే సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. కడుపులోని గడ్డను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు.
ఓ వైపు ఎమ్మెల్యేగా.. ప్రతి రోజు పలు కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న తెల్లం వెంకట్రావు.. అవకాశం వచ్చినప్పుడల్లా తన వైద్య వృత్తికి న్యాయం చేస్తూ ఇటువంటి అరుదైన ఆపరేషన్లను నిర్వహిసూ్త ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలను కాపాడటం పట్ల పలువురు అభినందిస్తున్నారు.